This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.
భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!

41 రోజుల (మండలం) అయ్యప్ప దీక్ష పూర్తిచేసుకున్న భక్తులు శబరిమల యాత్ర చేయాలి. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగిస్తుంది.

శబరిమలలో (కేరళ రాష్ట్రం) స్వామి సన్నిధానం (గుడి) సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో, అడవులు మరియు 18 కొండల మధ్యలో ఉంటుంది. శబరిమలై యాత్రలో మండల పూజలు / మండలం (నవంబరులో) మరియు మకర జ్యోతి దర్శనం (జనవరి 14) అతి ముఖ్యమైనవి.

ఇక్కడికి యాత్రలు నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతి మళయాళ నెలలో 5 రోజుల పాటు తెరిచి ఉంచుతారు.

ఈ యాత్రలో భాగంగా స్వాములు ముందుగా “ఇరుముడి ” ధరించాలి. ఒక జట్టుగా స్వాములు ఇరుముడి వేసుకుని గురు స్వామి(లు) ఆధ్వర్యంలో ఈ యాత్రను ఇరుముడి వేసుకున్న గుడి నుండి ఆరంభించాలి.

అయ్యప్ప స్వాములు వివిధ మార్గాల నుంచి "ఎరుమేలి" చేరుకొని అక్కడ నుంచి పాద యాత్ర చేయాలి. పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి - “పెద్ద పాదం” మరియు “చిన్నపాదం”.

"పెద్ద పాదం" - మహిషిని చంపడానికి స్వయంగా అయ్యప్ప నడిచిన మార్గం. ఇది కొండల మధ్య దట్టమైన అడవిలో ఉన్న 80 కిలోమీటర్ల కాలిబాట. దారిలో పెరుర్తోడు, కలకెట్టి, ఆళుదానది, ఇంచిప్పరకొట, కరిమల, సిరియాన వట్టం, పంబా, నీలిమలై, అప్పాచ్చిమేడు, శరంగుత్తి మొదలగు ప్రదేశములు కనిపిస్తాయి. పాదయాత్ర చేసి “ఇరుముడి” తలమీద పెట్టుకొని “పదునెట్టాంబడి” ఎక్కి సన్నిధానం చేరుకుని ఆ హరిహరిసుతన్ అయ్యన్ అయ్యప్పస్వామి దర్శనము చేసుకుంటారు.

“చిన్నపాదం” మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం కాలినడకన వెళ్ళాలి.

  • శబరిమలై యాత్ర
  • ఎరుమేలి
  • పెరుర్తోడు - కలకెట్టి
  • ఆళుదానది
  • ఇంచిప్పరకోట
  • కరిమల కొండ
  • పంబా
  • అప్పాచి మేడ - శబరి పీఠం
  • శరంగుత్తి - పదునెట్టాంబడి
  • స్వామి సన్నిధానం

ఎరుమేలి

- ఎరుమేలిలో భక్తులు "వావరు స్వామి" ని దర్శించుకొంటారు.
- అయ్యప్ప పులిపాలకోసం అడవిలో వెళుతున్నప్పుడు వావరు అడ్డుపడతాడు. అనంతరం స్వామికి సన్నిహిత భక్తుడిగా మారతాడు. అప్పుడు స్వామి "నన్ను దర్శించుకోవాలని వచ్చిన నా భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు" అని వరమిచ్చాడు.
- ఈ వావరు స్వామి ముస్లిం మతస్తుడు కాబట్టి మసీదులోనే కొలువైవుంటాడు. దర్శనానంతరం భక్తులు రకరకాల వేషధారణతో "పేటతుళ్ళై" అనే నాట్యం చేస్తారు.
- ఎరుమెలి వద్ద స్వామి మహిషిని చంపిన తరువాత ఆచరించిన నృత్యాన్ని "పేటతుళ్ళై" అంటారు. భక్తులు రకరకాల రంగులు పూసుకొని, పువ్వులు, బాణాలు, ధనస్సు ధరించి "స్వామి - థింథక - తోంతోం, అయ్యప్ప - థింథక - తోంతోం" అంటూ నృత్యం చేస్తారు.

పెరుర్తోడు - కలకెట్టి

- పెరుర్తోడు: ఇది ఒక నది, ఎరుమెలి నుంచి 4 కి.మీ దూరంలో ఉంటుంది. అయ్యప్పస్వామి తన యాత్రలో ఇక్కడ విశ్రమించాడు. పెరుర్తోడు దాటిన తరువాత వచ్చే అడవి పేరు “పూంగవనం (అయ్యప్ప వనం)” అని పిలుస్తారు.

- కలకెట్టి: ఇది పెరుర్తోడు కి 10 కి.మీ దూరంలో ఉంటుంది. అయ్యప్పస్వామి మహిషిని చంపుతున్నప్పుడు శివుడు ఇక్కడి నుంచే చూశాడు.
- మళయాళంలో "కల" అంటే "నంది" అని, మరియు "కెట్టి" అంటే "కట్టేయడం" అని అర్థం. రాక్షసి అయిన మహిషిని అయ్యప్ప చంపటం ప్రత్యక్షముగా చూడటానికి వచ్చినప్పుడు పరమశివుడు తన నందిని కట్టివేసిన ప్రదేశమని నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశమునకు "కలకెట్టి" అని పేరు వచ్చింది.
- భక్తులు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగించి వారి యాత్రను కొనసాగిస్తారు.


ఆళుదానది

- ఇది పంబా నదికి ఒక ఉపనది.
- ఇది కలకెట్టి నుంచి 2 కి.మీ దూరంలో ఉంటుంది. కఠినమైన ఈ మార్గం మీదుగా భక్తులు ఆళుదా కొండ పైకి చేరుకుంటారు.
- కొండ పైన ఉన్న ప్రాంతాన్ని "కల్లిదుంకున్ను" అంటారు. భక్తులు ఆళుదానదిలోని నునుపురాళ్ళను తీసుకొని ఇక్కడ ఒదిలేస్తారు (మహిషి అస్థికలని ఇలా పుడ్చేయటం).


ఇంచిప్పరకోట

- ఇది అతి ముఖ్యమైన ప్రదేశం, ఇక్కడ “కొట్టయిల్ శాస్త” అనే పుణ్యస్థలం ఉంది.
- భక్తులు ఇక్కడ ప్రార్థనలు చేసి కొబ్బరికాయలు కొడతారు.
- ఈ మార్గంలో భక్తులు చాల జాగ్రత్తగా నడవాలి.
- ఈ కోట మార్గం చివరికి “కరిమల తొడు” అనే కాలవ వద్ద ముగుస్తుంది.
- ఇప్పుడు యాత్రికులకు ఒకవైపు “ఆళుదా కొండ” మరొకవైపు “కరిమల కొండ” కనిపిస్తాయి.


కరిమల కొండ

- ఇక్కడ ఏనుగులు నివాసం ఉంటాయి.
- భక్తులు అడవి జంతువులు నుంచి, చల్లని వాతావరణం నుంచి కాపడుకోవటానికి దీపాలను వెలిగిస్తారు.
- కరిమల 7 స్థాయిలలో ఉంటుంది. 5 కి.మీ. మార్గం కఠినంగా ఉంటుంది కాబట్టి భక్తులు స్వామి నామస్మరణ చేస్తూ యాత్ర సాగిస్తారు. కరిమల పైకి చేరిన తరువాత భక్తులు విశ్రాంతి తీసుకొంటారు.
- ఇక్కడ చూడదగినది “నజిక్కిన్నార్” - ఒక బావిలో మరొక బావి (తాజా వసంతం లాంటి నీరు లభించును).
- దారిలో పెరియాన వట్టం (ఏనుగులు దప్పిక తీర్చుకునే స్థలము ), సిరియాన వట్టం (ఇచ్చట భక్తులు వంటలు చేసుకుని విశ్రమిస్తారు) అనే ప్రదేశాలు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి పంబానది 5 కి.మీ. ఉంటుంది.


పంబా

- సన్నిధానం వెళ్ళే మార్గంలో అతి పవిత్రమైన ప్రదేశం “పంబా”.
- ఇక్కడే రాజా రాజశేఖరునికి అయ్యప్పస్వామి దొరికిన ప్రదేశం.
- భక్తులు పంబా నదిని పవిత్ర గంగానదిగా భావిస్తారు. పంబా నది శాపాలను, చెడులను హరించి వేస్తుందని భక్తుల నమ్మకం.
- పంబా ఒడ్డు వద్ద జరిగే అతి ముఖ్యమైన ఆచారాలు “పంబా అన్నదానం” మరియు “పంబా దీపం”.
- సంధ్యాకాలంలో భక్తులు పంబా నది ఒడ్డుకు చేరి దీపాలను వెలిగిస్తారు. ఇరుముడిలో ఉన్న భోజన సామగ్రితో భక్తులు అన్నదానం తయారుచేస్తారు. పంబలో వేలాది మంది భక్తులు సమూహమవుతారు.
- సాధారణంగా, అన్నదానం తరువాత స్వాములు, గురుస్వామికి సాష్టాంగవందనం చేసి గురుదక్షిణ సమర్పించుకుంటారు.


అప్పాచి మేడ - శబరి పీఠం

- శబరి పీఠం: పంబలో స్నానమాచరించి గణపతిదేవునికి పూజ చేసిన తరువాత యాత్ర "నీలమల" కొండ మీదుగ కొనసాగుతుంది.
- ఈ కొండ "అప్పాచి మేడ" వరకు ఎత్తుగా, నిటారుగా ఉంటుంది.
- ఈ నీలిమల ఎక్కడం చాలా కఠినం. రామాయణంలో దీన్ని “మాతంగవనం” అంటారు.
- ఆ తరువాత శబరిపీఠం వరకు సాధారణ ఎత్తులో ఉంటుంది.
- ఈ స్థలం శ్రీ శబరి (శ్రీరాముని అపార భక్తురాలు) తపస్సు చేసిన ప్రదేశం. భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు.
-శబరి పీఠం లోనే పందళ రాజవంశీయులు విద్యాభ్యాసం చేశారు.


శరంగుత్తి - పదునెట్టాంబడి

శరంగుత్తి: శబరిపీఠానికి మరియు సన్నిధానానికి మధ్యలో "శరంగుత్తి" అనే ప్రదేశం ఉంటుంది. "శరం" అంటే "బాణం", "గుత్తి" అంటే "గుచ్చటం". ఇరుముడిలో ఉన్న బాణాన్ని కన్నెస్వాములు వదిలే ప్రదేశం ఇది.
- శరంగుత్తి నుంచి 15 నిమిషాలు కాలినడక దూరంలొ "పదునెట్టాంబడి" ఉంటుంది.
- "పదునెట్టాంబడి" అంటే "18 మెట్లు".
- 18 పరిపూర్ణతను సాధించిన ఙ్ఞానికి సంకేతం. ఆ ఙ్ఞాన సాధనే 18 మెట్లు ఎక్కడం.


స్వామి సన్నిధానం

- దీక్ష చేసినస భక్తులు “ఇరుముడి” తలమీద పెట్టుకొని స్వామి నామస్మరణ చేస్తూ పవిత్రమైనటువంటి 18 మెట్లను ఎక్కి అయ్యప్ప “స్వామి సన్నిధానం” చేరుకుని ఆ హరిహరిసుతన్ అయ్యన్ అయ్యప్పస్వామి దర్శనము చేసుకుంటారు.
- సన్నిధానంలో "పానవట్టం" పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు.
- స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని, ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు.
- ప్రధాన గర్భగుడి నుండి సుమారు 100 మీటర్ల దూరంలో "మాలికాపురత్తమ్మ" ఆలయం ఉంటుంది.

ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప !!! ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప !!! ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప !!!


వావర్ స్వామియే శరణమయ్యప్ప !

కన్నిమూల మహాగణపతియే శరణమయ్యప్ప !!

మాలికాపురత్తు లోకదేవిమాతావే శరణమయ్యప్ప !!!

Comment