This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.
భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!

గుడి స్థాపన:   1983-84 సంవత్సర కాలంలో ప్రజాదరణ కలిగిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ హెచ్. హెచ్. స్వామి విమోచనానందా దేశ వ్యాప్తంగా అయ్యప్ప దేవాలయాల ఏర్పాటు కార్యక్రమానికి మార్గదర్శక శక్తిగా ఉన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో శ్రీరంగపట్నం, కరుప్పతూర్(కేరళ), వారణాసి, హరిద్వార్, విజయవాడ (గొల్లపుడి), పాల్వంచ (ఖమ్మం), మండపేట (ప.గో.) వంటి ప్రాంతాల్లో అయ్యప్ప దేవాలయాలు ఏర్పాటయ్యాయి.

ఖమ్మంలోని అయ్యప్ప భక్తులు కొందరు ఆయనని సంప్రదించి ఖమ్మంలో ఆలయ నిర్మాణం కోసం సహాయం అర్థించారు. అందుకు ఆయన అంగీకరించి, ఆలయం ఏర్పాటు కోసం భూమిని ఎంపిక చేశారు. సామాజిక సేవ కోసం గుడితో పాటు ఒక పాఠశాల మరియు వివాహ వేదికను ఏర్పాటు చేయమని భక్తులకు సూచించారు. శ్రీ వంగవీటి రాఘవయ్య గారు (ప్రముఖ వ్యాపారవేత్త) గుడి నిర్మాణం కోసం శ్రీనివాసనగర్‌లోని 4166 చదరపు గజాల తన స్వంత భూమిని విరాళంగా ఇచ్చారు. స్వచ్ఛంద నమోదు క్రమసంఖ్య : 505/1983.

1986 సంవత్సరంలో స్వామి విమోచనానందా ఈ గుడికి పునాది రాయి వేసారు. ఆగమ శాస్త్రానుసారం అయ్యప్పస్వామి గుడితో పాటు శ్రీ విఘ్నేశ్వర, నాగరాజ, మల్లికాపురతమ్మ దేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళ నిర్మాణం జరిగింది.

ఆలయ నిర్వాహణ అధ్యక్షుడు (చైర్మన్):   శ్రీ వంగవీటి రాఘవయ్య గారి కుమారుడు శ్రీ ఠాగూర్ కనకయ్య ప్రభాకర్ గారు గుడి ప్రారంభమైన నాటి నుండి జనవరి 2013 వరకు ఆలయ నిర్వాహణ (చైర్మన్) అధ్యక్షుణిగా ఉన్నారు.

ఆలయం నిర్వహిస్తున్న ఫంక్షన్ హాల్ అయ్యప్పస్వామి దీక్ష తీసుకొను భక్తులకు, భజనలు, సత్సంగ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఇంకా వివాహాది శుభకార్యాలకు ఉపయోగపడుతుంది. 41 రోజుల మండల పూజ సమయంలో అయ్యప్ప దీక్ష చేసే భక్తులకు ట్రస్ట్ వారు ప్రతి రోజు 1000 మంది కోసం నిత్యాన్నదానం చేస్తారు. ఆలయం ట్రస్ట్ నిర్వహిస్తున్న విక్రయశాలలో, అయ్యప్ప మాలలు, దీక్షకు ఉపయోగించే వస్త్రాలు, ఇంకా దీక్ష మరియు పూజ సామాగ్రి లభిస్తాయి.

అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట:   అయ్యప్ప విగ్రహం పంచలోహాలతో (బంగారు, వెండి, రాగి, ఇనుము మరియు తగరం) తయారుచేశారు. అనేక వేల భక్తుల సమక్షంలో విగ్రహం యొక్క ప్రధానమైన ఆకృతిని కుంబకోణానికి చెందిన శిల్పులు తయారు చేశారు.

ధ్వజస్తంభం:  39 అడుగుల ఎత్తు గల ధ్వజస్తంభం పూర్తిగా ఇత్తడితో కప్పబడి ఉన్నది. అయ్యప్ప స్వామి పూజలన్నీ కేరళ పూజారులు (నంబూద్రి) కేరళ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు.

మండల పూజలు:   ప్రతి సంవత్సరం ఈ పూజలు నిర్వహిస్తారు. ఇది 41 రోజులు జరిగే మహోత్సవం. స్వామివారి నిత్య పూజలతో పాటు, ఉత్సవ విగ్రహంతో భక్తులతో గుడి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణము చేస్తారు. ఇలా ప్రతి రోజు మూడు సార్లు చేస్తారు. లక్షార్చణ మరియు అన్నదానం మండల పూజ ముగిసే ముందర జరుగుతాయి. మండల పూజ ముగింపులో వేల సంఖ్యలో భక్తులు చేతిలో దీపాలతో పట్టణ వీధుల్లో పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు. కొందరు భక్తులు అగ్నిగుండంలో నడుస్తారు.

ఇరుముడి:   ప్రతి సంవత్సరం స్వామి వారి "దీక్ష" తీసుకునే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవల(2011లో) 7000 మంది భక్తులు మా ఆలయంలో స్వామి దీక్ష స్వీకరించారు. మండలం (41 రోజుల) దీక్ష పూర్తైయిన తర్వాత భక్తులు ఆలయంలో ఇరుముడి తీసుకొని శబరిమల యాత్ర ప్రారంభిస్తారు. దీక్షను విజయవంతంగా పూర్తి చేసి అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్ళే భక్తులకు ఇరుముడి చాలా ముఖ్యం. ఇరుముడిని భక్తులు తమ తలపై పెట్టుకొని స్వామి సన్నిధానంలో గల 18 మెట్లపై నడచి వెళ్తారు. ఇరుముడి లేని భక్తులకు 18 మెట్లపై నడచి వెళ్ళే అవకాశం ఉండదు. ఈ 18 మెట్లను విష్ణువు అవతారమైన పరశురాముడు నెలకొల్పాడు.

మకరజ్యోతి దర్శనం:   మకర సంక్రాంతి నాడు సంధ్యా సమయంలో జ్యోతి దర్శనమగును. ఈ రోజున 18కిలోల కర్పూరాన్ని ఆలయప్రాంగణములో వెలిగిస్తారు. భక్తులకు "జ్యోతి స్వరూపం"లో దర్శనం ఇస్తానని తన తండ్రికి అయ్యప్పస్వామి వాగ్దానం చేశాడని భక్తులు విశ్వసిస్తారు. వేలాదిగా భక్తులు మకర సంక్రాంతి నాడు జ్యోతిస్వరూపుడైన మణికంఠుని దర్శనం కోసం ఆలయానికి వస్తారు.

విశు:   ఈ రోజు భక్తులు అయ్యప్పస్వామి యొక్క "విశు కన్ని దర్శనం" చేసుకుంటారు. అయ్యప్పస్వామి కృప వలన సంవత్సర కాలమంతా భోగ భాగ్యాలతో శుభప్రదంగా సాగగలదని నమ్ముతారు.

ఆలయ పరిసరాలు ప్రముఖ ప్రాంతాలుగా వెలుగొందుతున్నాయి. ఇప్పుడు ఈ గుడి నగరానికి మరియు ఖమ్మం జిల్లాలో ఒక ప్రముఖ, దివ్య స్థలంగా పేర్కొనబడుతున్నది.



ధర్మశాస్తావే శరణమయ్యప్ప !

పందళ రాజకుమారనే శరణమయ్యప్ప !!

కన్నిమూల మహాగణపతియే శరణమయ్యప్ప !!!

Comment