This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.
భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!

అయ్యప్ప అంటే ఎవరు? అయ్యప్ప హరిహరసుతుడు. అతడు కారణజన్ముడు. అయ్యకు (శివయ్య, సాంబయ్య) అప్పకు (వెంకటప్ప, నారాయణప్ప) పుట్టినవాడు గనుక అయ్యప్ప అని పిలువసాగిరి. అదియే వాడుకై నేడు అయ్యప్పగా ఘనకీర్తి గడించుచున్నాడు ఆ దేవదేవుడు. [మరో కథనం ప్రకారం వనములకేగు మణికంఠుని తల్లిదండ్రులు వలదని అభ్యర్థిస్తూ ‘అయ్య’, ‘అప్ప’ అని సంబోధిచగా, ఆ నామమే సార్థకమగునని ఆ స్వామి పలికెను.]

అయ్యప్పను ధర్మశాస్తా, మణికంఠ, శబరిగిరీశా, చిన్ముద్రవాసా అని పలు నామాలతో పిలుస్తారు.


 • అయ్యప్ప జన్మ రహస్యం
 • మోహిని అందం -
  భస్మాసుర అంతం
 • క్షీరసాగర మథనం - అయ్యప్ప జననం
 • మహిషాసురినికి వరం - దుర్గాదేవి అవతారం
 • దత్తాత్రేయ శాపం -
  మహిషి కోపం
 • రాజశేఖరుని ఆవేదన - అయ్యప్ప ఆరాధన
 • అయ్యప్ప కథ -
  మహిషి వధ
 • శబరిమల పుణ్యక్షేత్రం - మణికంఠుని స్తోత్రం

మోహిని అందం - భస్మాసుర అంతం

పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతలతో ప్రతి యుద్దంలోను ఓటమి లేని వాడిగా, మరియు దేవతలను నాశనం చేయాలన్న దుర్బుద్ధితో శివుని కోసం కఠోర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై “ఏమి వరం కావాలో కోరుకో” అంటే ప్రకృతికి విరుద్ధమైన కోరిక "అమరత్వం (మరణం లేకపోవటం)" ప్రసాదించమని కోరతాడు. దానికి శివుడు నిరాకరించగా భస్మాసురుడు - "నేను ఎవరి తలపై నా చేయి పెడతానో వాళ్ళు భస్మమైపోవాలి" అని వరం కోరతాడు. దానికి శివుడు అంగీకరిస్తాడు. భస్మాసురుడు ఆ వరమును పరీక్షించేందనని శివుని తలపైన తన చేయి వేయ ప్రయత్నించగా, శివుడు పారిపోవలసి వచ్చింది. భస్మాసురుడు వెంబడించాడు. శివున్ని కాపాడుటకై విష్ణుమూర్తి "మోహిని" అవతారం దాలుస్తాడు.

విష్ణుమూర్తి, మోహిని అవతారంలో, భస్మాసురుని ఎదుట నిలుస్తాడు. మోహిని యొక్క అందమును చూసి భస్మాసురుడు వ్యామొహంలో పడిపోతాడు. భస్మాసురుడు మోహినితో “నిన్ను పెళ్ళి చేసుకుంటాను” అనగా అప్పుడు మోహిని "నాకు నాట్యం అంటే చాలా ఇష్టం కావున నాలాగ నాట్యం చేసిన వారినే పెళ్ళాడుతాను" అని అంటుంది. భస్మాసురుడు ఆ పందెమును అంగీకరించి నృత్యం మొదలుపెడతాడు. అలా నృత్యం చేస్తూ మోహిని ఒక భంగిమలో తన చేయి తన తల పైన పెట్టుకుంటుంది. భస్మాసురుడు మోహిని యొక్క భంగిమను అనుకరించగా తన తలపైన తనే చేయి పెట్టుకుంటాడు. శివుని వరప్రభావము వలన భస్మాసురుడు భస్మమైపోతాడు. దేవతలు ఆనందిస్తారు!
క్షీరసాగర మథనం - అయ్యప్ప జననం

దుర్వాస మహర్షి (శివుని అంశలో అత్రి మహర్షి, సతీ అనసూయకు కుమారునిగా జన్మించాడు, బ్రహ్మదేవుని మనవడు) మహా కోపి. అతను ఒక రోజు భూలోకమున తిరుగుతున్నప్పుడు వనదేవత నుంచి పుష్పగుచ్ఛాన్ని పొందుతాడు. తను ఆ పుష్పగుచ్ఛాన్ని స్వీకరించి తన ప్రయాణమును కొనసాగించుచుండగా ఇంద్రుడు ఐరావతం మీద కనపడతాడు. దుర్వాసుడు ఆ పుష్పగుచ్ఛాన్ని ఇంద్రునికి ఇవ్వగా ఇంద్రుడు ఐరావతం మీద పెడతాడు. ఆ పూల సువాసనకు చిరాకు వచ్చి ఐరావతం ఆ పుష్పగుచ్ఛాన్ని క్రిందకు పడవేస్తుంది. అది చూసి దుర్వాసుడికి మిక్కిలి కోపం వచ్చి - "మీ దేవతలు కూడా ఈ పుష్పగుచ్ఛంవలే త్రిలోకమల నుండి పడిపోవుదురు గాక" అని శపిస్తాడు.


దుర్వాస మహర్షి శాపం వలన దేవతలు శక్తిని కోల్పోతారు. ఇదే సమయమని రాక్షసులందరు కలిసి దేవతలపైన యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు దేవతలందరు బ్రహ్మదేవుని వద్దకు తరలిపోగా బ్రహ్మదేవుడు వారిని విష్ణుమూర్తి వద్దకు పంపుతాడు. అప్పుడు విష్ణుమూర్తి దేవదేవదానవులందరు కలిసి క్షీరసాగర మథనం చేసి అందులో నుంచి వచ్చే “అమృతం" (ఇది తాగినివారికి చావు ఉండదు) అందరం పంచుకుందాము అని అంటాడు. దానికి దేవతలు మరియు రాక్షసులు అంగీకరిస్తారు. కాని విష్ణువు ఆ అమృతం దేవతలకి మాత్రమే అందేటట్లు చేస్తానని హామి ఇస్తాడు. "అదే విష్ణు మాయ!". "మందరగిరి" అనే పర్వతమును కవ్వముగా, "వాసుకి"ని(నాగలోకానికి రాజు) రజ్జుగా చేసి దేవతలు వాసుకి తోక వైపు రాక్షసులు పడగ వైపు నిలిచి క్షీరసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆధారము లేక మందరగిరి క్షీరసాగరములోనికి జారిపోతుండగా విష్ణుమూర్తి కూర్మావతారం దాల్చి మందరగిరిని తన వీపు పై ధరిస్తాడు.


మొదట ప్రపంచాన్ని దహిచేంతటి “హాలాహలం” వచ్చింది. దాన్ని శివుడు తన కంఠంలో దాచి అందరిని కాపాడతాడు. ఆ పిమ్మట దేవదానవులు మరల చిలుకుతుండగా సంపన్నమైన అనేక వస్తువులు, ఇంకా వరాలు తీర్చే కామధేనువు వస్తుంది. చివరికు "ధన్వంతరి" (విష్ణువు అంశ, దేవతల వైద్యుడు, ఆయుర్వేద దేవుడు) అమృతకలశాన్ని చేతబట్టుకొని అవతరిస్తాడు.విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెడతాడు. విష్ణుమూర్తి మోహిని రూపంలో శివుని వద్దకు వచ్చి తను ఇచ్చిన మాటను పూర్తిచేశాను అని చెప్తాడు. శివుడు మోహిని యొక్క అందానికి ఆకర్షితుడై మోహినిని కవ్విస్తాడు. లోకకళ్యాణం కోసమే హరి-హర కలయిక. ఆ (హరిహరాద్వైత)కలయిక ఫలమే మన "అయ్యప్ప".

హరిహరసుతనే శరణమయ్యప్ప !!! హరిహరసుతనే శరణమయ్యప్ప !!! హరిహరసుతనే శరణమయ్యప్ప !!!మహిషాసురినికి వరం - దుర్గాదేవి అవతారం

అసురుల రాజైన రంభుడు ఒకనాడు 'మహిషం' (దున్నపోతు) తో కలిసిన మూలంగా మహిషాసురుడు జన్మిస్తాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.
మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు మరియు దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. అనంతరం ఆ వరగర్వంతో స్వర్గలోకం మీద, భూలోకం మీద దండెత్తి దేవతలందరిని తరిమికొడతాడు.
బ్రహ్మ వరానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడించి సుందరమైన నవయవ్వన యువతిని సమస్త శక్తివంతురాలిగా "దుర్గ"ను సృష్టిస్తారు. దుర్గ మహిషున్ని ఎదిరించి 9 రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఆ రాక్షసున్ని వధిస్తుంది. అందువలన దుర్గాదేవిని "మహిషాసుర మర్ధిని” అని పూజిస్తారు.దత్తాత్రేయ శాపం - మహిషి కోపం

ఒకసారి నారదుడు ఇనుప సెనగలను వండి వడ్డించమని జగన్మాతలైన భారతి(సరస్వతి), పార్వతి, లక్ష్మీదేవతలను కోరగా అది అసాధ్యమని వారనెను. అప్పుడు నారదుడు, "ఈ చిన్నపనిని అత్రి మహా ముని భార్యయైన మహా పతివ్రత అనసూయాదేవి చేయగలదు" అని పలికి అనసూయ వద్దకు వెళ్ళి "తల్లీ! ఈ ఇనుప సెనగలను నాకొరకు వండి వడ్డించుమనెను". అనసూయ తన పతిదేవుని ప్రార్థించి నారదుని అభీష్టమును నెరవేర్చెను. ఇది ముగ్గురమ్మలకు అవమానముగా తోచి, అనసూయను పరీక్షించమని త్రిమూర్తులను వేడుకొనెను. త్రిమూర్తులు దానికి అంగీకరించి అత్రి ఆశ్రమమును చేరి "భవతి భిక్షాందేహిః" అని నగ్న దేహిగా వడ్డించమని ముగ్గురు అతిదులై ముంగిటనిలుస్తారు. అప్పుడు అనసూయ త్రిమూర్తులను పసిపాపలుగా మార్చుకొని భూత భవిష్యత్ వర్తమానముల మాతృ జన్మ ఈడెత్తుకొని హరిహర బ్రహ్మలను ముద్దాడుతుంది. అదితెలిసిన ఉమతి, రమతి, భారతి మహా పతివ్రత అయిన అనసూయమ్మను పతిభిక్ష పెట్ట మని కోరతారు. ఆమె కరుణించి ఆ వరమిచ్చి త్రిమూర్తుల అంశతో తమకొక కుమారుడ్ని ఇవ్వమని కొరుతుంది. "దత్తాత్రేయుడు" జన్మిస్తాడు.


త్రిమూర్తులు తమ అంశను "సమర్పించుకున్నారు" కనుక అతడికి "దత్త" అని పేరు వచ్చింది. అత్రి కుమారుడు కనుక "ఆత్రేయ" అయింది. దత్తాత్రేయ మొట్టమొదటిలో యోగదేవుడుగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ, తర్వాత అతడు మరింత భక్తికి సంబంధించిన వైష్ణవ పూజావిధానాలను పుణికి పుచ్చుకుని, సంలీనమయ్యాడు. దత్తాత్రేయుడు లీలావతిని (లక్ష్మీ,పార్వతి,సరస్వతుల కలియిక) పెళ్ళాడతాడు. అలా కాలం గడుచుచుండగా ఒకరోజు వారిరువున మధ్య వాదన మొదలవుతుంది. దత్తాత్రేయుడు ఆగ్రహానికి గురై - "మరుజన్మలో మహిషి (గేదె) రూపంలో రాక్షసుల రాజ్యంలో నువ్వు జన్మిస్తావు" అని లీలవతిని శపిస్తాడు.


రంభునుకి కారంబ అనే సోదరుడు ఉన్నాడు. కారంబునికి "లీల" అనే కూతురు ఉన్నది. తను గేద రూపంలో ఉంటుంది కనుక "లీల మహిషి" అని పిలుస్తారు. తన అన్న(మహిసాసురుడు) మరణానికి కారణమైన దేవతల మీద పగ తీర్చుకోటానికి మరియు రాక్షసుల రక్షణ కోసం శుక్రాచార్యుని ఆనతితో శత్రుపరాభవమే తన గురిగా మహిషి బ్రహ్మ కోసం తీవ్రమైన తప్పస్సు మొదలుపెడుతుంది. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అమరత్వం తప్ప ఏమి వరం కావలో కోరుకో మనగా "నన్ను చంపగలిగినవాడు హరికి(విష్ణువు) మరియు హరునికి(శివుడి) పుట్టి 12 సంవత్సరాలు భూలోకాన సేవాధర్మం నిర్వర్తించి ఉండాలి" అని కోరుతుంది మహిషి. ఆ వరాన్ని ఇచ్చి తన లోకానికి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి మదమెక్కిన లీల మహిషి సూర్యుడ్ని తన్ని, చెంద్రుడిని కుమ్మి , ఇంద్రపదవిని ఆక్రమించి దేవతలను హింసించటం మొదలు పెడుతుంది.
రాజశేఖరుని ఆవేదన - అయ్యప్ప ఆరాధన

పాండ్య సార్వభౌముడు, శ్రీ మహీపాలకుడు రాజశేఖర మహారాజు. అతని పాలనలో ప్రజలందరు మిక్కిలి ఆనందంతో జీవించుచున్నారు. ప్రజలకు ఏ లోటు రాకుండా రాజ్యపాలన చేయుచున్నాడు. అష్టైశ్వర్యాలు, కీర్తి ప్రతిష్ఠలు ఎంత ఉన్నా తన పిమ్మట రాజ్యమును చూసుకొనుటకు వారసులు లేరనే ఆవేదన ఎప్పుడూ వెంటాడుతుండేది. రాజదంపతులు పిల్లల కోసం పరమ శివున్ని ప్రార్థించసాగిరి. ఇలా ఉండగా తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరిస్తాడు "ధర్మశాస్తా". అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు రాజశేఖరుడు. అరణ్యంలో ఒక చోట విశ్రమించుచుండగా శిశువు ఏడుపు వినిపిస్తుంది. ఏడుపు వినిపిస్తున్న దిశగా వెళ్ళిన రాజుకు మెడలో మణిమాల, ముఖములో మహాతేజస్సుతో పసిబాలుడు కనిపిస్తాడు. ఆశ్చర్యచరితుడైన రాజు ఆ పసివాడిని ఈశ్వర ప్రసాదంగా తలంచి ఎత్తుకుని ఆనందంతో ముద్దాడతాడు. అప్పుడు ఒక మహర్షి ప్రత్యక్షమై "రాజా! ఈ పసివాడు కారణజన్ముడు, నీ రాజ్యమునకు తీసుకొని వెళ్లు, పన్నెండు సంవత్సరముల తరువాత ఆ బాలుని జన్మ రహస్యం నీకు తెలుస్తుంది" అని చెప్పి మాయమైపొతాడు. రాజు మిక్కిలి ఆనందభరితుడై రాజ్యానికి చేరి రాణికి జరిగిన విషయం చెపుతాడు. రాజ్యంలో ఉన్నవారందరు సంతోషిస్తారు, ఒక్క మంత్రి తప్ప.


మణికంఠుని రాకతో రాజ్యమంతా దిన దిన ప్రవర్థమానమై సుఖసంతోషాలతో సిరిసంపదలతో విరాజిల్లుతుంది. గురుకుల విద్యాభ్యాసంలో, శరసంధాన ప్రయోగంలో, సర్వ శాస్త్రములలో పండితుడౌతాడు మణికంఠుడు. ఆ బాలుని అసాధరణ ప్రతిభను చూసి గురువు ఆశ్చర్యపడి ఇతడు "దైవస్వరూపుడు" అని అనుకునేవాడు. గురుదక్షిణగా గురు పుత్రునికి కంటి చూపు మరియు మాటనిచ్చి తన మహిమ చూపుతాడు మణికంఠుడు. కొంత కాలానికి రాణి పండంటి మగబిడ్డని ప్రసవిస్తుంది. ఆ బిడ్డకు "రాజరాజన్" అని నామకరణం చేస్తారు. రాజశేఖరుడు మణికంఠుని తన పెద్ద కొడుకుగా భావించి అతని యొక్క ప్రతిభకు మురిసిపోయి అతనికి పట్టాభిషేకం చేయ నిశ్చయించి, మంత్రిని ఏర్పాట్లు చేయమంటాడు. రాజ పదవి కోసం అత్యాశ పడి మంత్రి దుర్బుద్ధితో మణికంఠునికి హాని తలపెట్టాలనుకుంటాడు. వివిధ పద్ధతులలో ప్రయత్నించి, విఫలమై చివరకు మణికంఠుడు తినే ఆహారంలో విషం కలపటం వలన అయ్యప్ప మంచాన పడతాడు. అప్పుడు సాక్షాత్ పరమశివుడే వైద్యునిగా వచ్చి కాపాడతాడు. ఈ ప్రయత్నం కూడా విఫలమవ్వటంతో మంత్రి రాణి దగ్గరకి వెళ్లి లేనిపోని మాటలు చెప్పి సొంత కొడుకైన రాజరాజన్‌కే పట్టాభిషేకం జరగాలని రాణిని ప్రభావితం చేస్తాడు.
అయ్యప్ప కథ - మహిషి వధ

మంత్రి మాటలు విని రాణి ఆలోచనలో పడుతుంది. ఇదే అనుకూలమైన సమయమని రాణిని తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పి వచ్చినట్లు నటించమంటాడు మంత్రి. రాణికి బాధ తీవ్రంగా వుందని వైద్యుని పిలుపిస్తాడు రాజు. ఆ వైద్యునితో, ఈ కడుపునొప్పికి పులి పాలు తప్ప మరొక మందులేదని చెప్పిస్తాడు మంత్రి. ఎవరైతే పులిపాలు తెస్తారో వారికి రాజ్యంలో అర్ధభాగం ఇస్తానని రాజు ప్రకటిస్తాడు. కపట మంత్రి వీరులెవ్వరినీ ముందుకు రానీయకుండా చేస్తాడు. తల్లి బాధకు తల్లడిల్లిపోయిన మణికంఠుడు "నేను అడవికి పోయి పులి పాలు తెస్తాన"ని అంటాడు. రాజు అందులకు నిరాకరిస్తాడు. మణికంఠుడు రాజుని ఓదార్చి, తానొక్కడే ఒంటరిగా అడవికి వెళ్లేందుకు ఒప్పిస్తాడు. మణికంఠుడు అడవికి వెళ్లేందుకు కావలసిన ఆహారం మరియు శివుని గుర్తుగా మూడుకన్నులున్న కొబ్బరికాయలను ఇచ్చిపంపుతాడు రాజు. అయ్యప్పకు తోడుగా పంచభూతాలను పంపుతాడు శివుడు.


అడవిలో ఇంద్రుడు ప్రత్యక్షమై మహిషి చేసే అరాచకాలను, దారుణాలను వెల్లడించి కారణజన్ముడైన మణికంఠునికి జన్మరహస్యం వివరిస్తాడు. అది విన్న మణికంఠుడు కర్మ వీరుడై, ఖడ్గ హస్తుడై, కాలరూపురుడై మహిషితో యుద్ధం మొదలుపెడతాడు. దేవలోకము నుండి భూమి మీదకు విసిరితే మహిషి అళుదా నది తీరాన పడుతుంది. ఆ నదీ తీరము వద్దనే మహిషి వధ జరుగుతుంది. పశువైన మహిషి ఛాతి మీదకెక్కి అయ్యప్ప నృత్యం చేస్తాడు. ఈ నృత్యం చేసేది సాక్షాత్ హరిహర పుత్రుడేనని మహిషికి అర్దమై మణికంఠునికి సాష్టాంగ ప్రణామం చేసి మరణిస్తుంది. ఈ నృత్యమును శివుడు, మహావిష్ణువు "కలకెట్టి" అనే ప్రదేశము నుండి ప్రత్యక్షముగా తిలకించినారు. మహిషికి శాపవిముక్తి కలిగి "మాలికాపురతమ్మ"గా అవతరిస్తుంది. మాలికాపురతమ్మ పెళ్ళి చేసుకోమని మణికంఠుని ప్రార్దించగా, "ఎప్పుడైతే నన్ను దర్శించడానికి కన్నెస్వామి రాడో అప్పుడు పెళ్ళి చెసుకుంటాను, అప్పటి వరకు బ్రహ్మచారిగానే ఉంటాను" అని చెప్తాడు. మహిషి వధ చూసి మనసా, శిరసా నమస్కరించి పులిగా మారి అయ్యప్పకు వాహనంగా తనమీద కూర్చొపెట్టుకొని రాజ్యానికి తీసుకొని వెళ్తాడు మహేంద్రుడు.
శబరిమల పుణ్యక్షేత్రం - మణికంఠుని స్తోత్రం

అయ్యప్ప పులుల సమూహంతో రాజ్యానికి చేరటం చూసి రాజు ఆశ్చర్యచకితుడైతాడు. పన్నెండు సంవత్సరముల ముందు కనిపించిన అదే మహర్షి మళ్ళీ ప్రత్యక్షమై మణికంఠుని జన్మరహస్యం చెప్తాడు. రాజశేఖరుడు మణికంఠుని పాదముల మీదపడి తాను తెలియక చేసిన తప్పులను క్షమించమని కోరతాడు. అపుడు మణికంఠుడు "అంతా దైవకారణానికై జరిగినది, కావున మంత్రిని శిక్షించకండి, మరియు నేను భూలోకమునకు వచ్చిన కార్యము కూడ పూర్తయి తిరిగి దేవలోకమునకు వెళ్ళు సమయం ఆసన్నమయ్యింది, మీకు ఏమి వరం కావాలో కోరుకోమ"ని అడుగుతాడు. దానికి రాజు "మీ ఙ్ఞాపకార్దంగా గుడిని నిర్మించదలిచాను కావున ఆ ఆలయమునకు అనువైన స్థలమును చెప్పమ"ని అడుగుతాడు. అప్పుడు మణికంఠుడు "ఈ బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నిర్మించండి" అని మాయమైపోతాడు. ఆ బాణం కేరళలో "శబరి" అనే స్థలమున పడుతుంది.


రాజశేఖరుడు అగస్త్య మహర్షి సలహా ప్రకారం శబరిమల మీద అయ్యప్పస్వామి దేవాలయాన్ని18 మెట్లతో నిర్మించాడు. ధర్మశాస్త ఆదేశానుసారం పరశురాముడు అయ్యప్ప విగ్రహమును తయారుచేయుటకు శబరిమలకు వెళతాడు. పరశురాముడు మకర సంక్రాంతినాడు అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు. "ఎవరైతే 41 రోజులు నా దీక్షను నియమాలతో ఆచరించి, బ్రహ్మచర్యం చేసి, మంచి పనులు చేస్తూ, నా దర్శనానికి వచ్చేటప్పుడు ఇరుముడిని తలమీద పెట్టుకుని, పంబలో స్నానమాచరించి, నా నామస్మరణ చేస్తారో వారు మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కుటకు అర్హులు, వారిని నేను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాను" అని స్వామి తెలిపాడు. "గంగానది అంత పవిత్రమైనది పంబానది, కాశి అంతటి పుణ్యమైనది ఈ శబరిమల. మకర సంక్రాంతి నాడు నా కోసం చేయించిన ఆభరణాలను నాకు అలంకరించండి" అని సెలవు తీసుకుంటాడు అయ్యప్ప.

"శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే - శివస్య హృదయం విష్ణోః విష్ణశ్చ హృదయం శివః"
!!! సంధ్యావందన గీతం, శివకేశవుల అనుబంధం, ఆదిశంకరుల అద్వైతం అదే శబరిగిరీషుని అవతారం !!!హరిహరసుతనే శరణమయ్యప్ప !

పందళ రాజకుమారనే శరణమయ్యప్ప !!

మాతా-పితా-గురు-దైవమే శరణమయ్యప్ప !!!

Comment